జాతీయ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాతీయ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ
राष्ट्रीय राजमार्ग एवं अवसंरचना विकास निगम लिमिटेड
దస్త్రం:National Highways and Infrastructure Development Corporation Limited logo.png
సంకేతాక్షరంNHIDCL
స్థాపన18 July 2014; 9 సంవత్సరాల క్రితం (18 July 2014)
రకంకేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ
చట్టబద్ధతActive
కేంద్రీకరణజాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణ
ప్రధాన
కార్యాలయాలు
వరల్డ్ ట్రేడ్ సెంటర్, నౌరోజీ నగర్, ఢిల్లీ
సేవా ప్రాంతాలు India  Nepal
ప్రధానభాగండైరెక్టర్ల బోర్డు
మాతృ సంస్థరోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ,
అనుబంధ సంస్థలుభారత ప్రభుత్వం
బడ్జెట్30,000 crore (US$3.8 billion) (2022-23 అంచనా.)
జాలగూడుwww.nhidcl.com

జాతీయ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (నేషనల్ హైవేస్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ - ఎన్‌హెచ్‌ఐడిసిఎల్), 2014 లో స్థాపితమైన భారత ప్రభుత్వానికి చెందిన పూర్తి యాజమాన్య సంస్థ. 1,15,000 కి.మీల నిడివి గల భారతదేశ రహదారులలో 10,000 కి.మీ. పైచిలుకు జాతీయ రహదారుల నెట్‌వర్కు నిర్వహణకు ఇది బాధ్యత వహిస్తుంది. ఇది రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) వారి నోడల్ ఏజెన్సీ. 2024 ఫిబ్రవరి 14 నుండి క్రిషన్ కుమార్ (IAS) ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ కు మేనేజింగ్ డైరెక్టరుగా ఉన్నాడు. సంస్థ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో నౌరోజీ నగర్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఉంది.

చరిత్ర

[మార్చు]

కంపెనీల చట్టం, 2013 ప్రకారం ఈ సంస్థను తొలుత హైవేస్ కనెక్టివిటీ కంపెనీ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేసారు. ఆ తర్వాత కంపెనీ పేరును నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌గా మార్చారు. 2014 జూలై 18 నుండి ఇది పని చేయడం ప్రారంభించింది.[1] భారతదేశంలోని జాతీయ రహదారులు, వ్యూహాత్మక రహదారులు, తదితర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి, నిర్వహించడానికీ దీన్ని స్థాపించారు. అంతర్జాతీయ సరిహద్దులున్న ప్రాంతాలకు, దేశం లోని ఇతర ప్రాంతాల నుండి అనుసంధానాన్ని ప్రోత్సహించే పనికి ఇది అంకితమైంది. ఇది భారతదేశంలోని ఈశాన్య భాగం, అండమాన్ నికోబార్ దీవులు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలలో జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. ఇది ఎత్తైన ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలలో ప్రత్యేక ఏజెన్సీగా పనిచేస్తుంది. ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ హైవేలే కాకుండా, లాజిస్టిక్ హబ్‌లు, రవాణా సంబంధిత మౌలిక సదుపాయాలను కూడా నిర్మిస్తోంది. ఉదాహరణకు బస్ పోర్ట్‌లు, కంటైనర్ డిపోలు, ఆటోమేటెడ్ మల్టీలెవల్ కార్ పార్కింగ్ వంటి మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లను ఇది నిర్మిస్తుంది. ఆనంద్ కుమార్ (IAS), ఈ సంస్థకు మొదటి మేనేజింగ్ డైరెక్టర్. [2]

కూర్పు

[మార్చు]
  • అనురాగ్ జైన్, (IAS) సెక్రటరీ ( MORT&H ) కంపెనీకి ఎక్స్-అఫీషియో చైర్మన్. డైరెక్టర్ల బోర్డులో - ఒక మేనేజింగ్ డైరెక్టరు, అదనపు డైరెక్టర్ జనరల్ ఎక్స్-అఫీషియో డైరెక్టర్ (టెక్.), ఒక డైరెక్టర్ (ఫైనాన్స్/అడ్మినిస్ట్రేషన్), ముగ్గురు స్వతంత్ర పార్ట్-టైమ్ డైరెక్టర్లు, ఐదుగురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (టెక్.) ఉంటారు. వీరు ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేస్తారు.[3]
  • ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ కు 14 రాష్ట్రాలు/UTలలో 14 ప్రాంతీయ కార్యాలయాలు (ROలు), 46 ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్లు (PMUలు), దాదాపు 70 సైట్ కార్యాలయాలు (SOs) ఉన్నాయి. ప్రాంతీయ కార్యాలయాలకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, PMUలు జనరల్ మేనేజర్‌ల నేతృత్వం వహిస్తారు. క్షేత్ర కార్యాలయాలు డిప్యూటీ జనరల్ మేనేజర్/మేనేజర్ల నేతృత్వంలో ఉంటాయి.
  • మేనేజర్ స్థాయికి దిగువన ఉన్న ఇంజనీర్లు హైవేలు, సొరంగాలు, వంతెనలు తదితర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పన, ప్రణాళిక, పర్యవేక్షణ, భద్రతా ప్రమాణాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం, నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక సమస్యలను పరిష్కరించడం వంటి పనులకు బాధ్యత వహిస్తారు. ప్రాజెక్టుల రూపకల్పన, నిర్మాణం లేదా నిర్వహణకు సంబంధించిన ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి వారు కాంట్రాక్టర్‌లు, కన్సల్టెంట్‌లు, ఇతర వాటాదారులతో కలిసి పని చేస్తారు. బడ్జెట్టు లోపల, ఇచ్చిన టైమ్‌ లోపల ప్రాజెక్టు పూర్తయ్యేలా చూసుకుంటారు.[4]

ప్రాజెక్టులు

[మార్చు]
భారతదేశ జాతీయ రహదారుల మ్యాప్

ఎన్‌హెచ్‌ఐడిసిఎల్, సరిహద్దు రహదారుల సంస్థతో కలిసి ఈశాన్య భారతంలో జాతీయ రహదారులలో భాగంగా ఈశాన్య ప్రాంతంలోప్రత్యేక వేగవంతమైన రోడ్ల అభివృద్ధి కార్యక్రమాన్ని (స్పెషల్ యాక్సిలరేటెడ్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ .. SARDP-NE) అమలు చేస్తోంది. SARDP-NE కింది దశల్లో అమలుచేస్తోంది.

  • దశ-ఎ: దీన్ని 2005 లో ఆమోదించారు. ఇందులో దాదాపు 4,099 కి.మీ. నిడివి గల రోడ్లున్నాయి (3,014 కి.మీ. ఎన్‌హెచ్, 1,085 కి.మీ. రాష్ట్ర రహదారుల). ఈ దశ 2023-24 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.[5]
  • దశ-బి: ఇందులో 3,723 కి.మీ. రహదారులను చేపడతారు. ఇందులో 2,210 కి.మీ. ఎన్‌హెచ్‌లు కాగా, 1,513 కి.మీ. రాష్ట్ర రహదారులు. ఎ-దశ పూర్తయిన తర్వాత ఈ దశను చేపడతారు.[6]

గుర్తించదగిన రహదారి ప్రాజెక్టులు

  1. చార్ ధామ్ ప్రాజెక్టు: ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ చార్ ధామ్ ప్రాజెక్టుతో సహా అనేక మెగా ప్రాజెక్టులను చేపడుతోంది. చార్ ధామ్, భారతదేశంలోని ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు. హిమాలయ ప్రాంతంలోని చార్ ధామ్ అనే పేరున్న నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలకు కనెక్టివిటీని మెరుగుపరచడం దీని లక్ష్యం. హిందువులకు అపారమైన మతపరమైన, సాంస్కృతిక పరమైన ప్రాముఖ్యత కలిగిన యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ పవిత్ర పుణ్యక్షేత్రాలకు దారితీసే రహదారి నెట్‌వర్క్‌ను మెరుగుపరచడంపై ఈ ప్రాజెక్టు దృష్టి సారిస్తుంది. ఈ ప్రాజెక్టుకు రూ.12,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
  2. ఇంఫాల్-మోరే రోడ్ ప్రాజెక్టు: మణిపూర్‌లో 65 కిలోమీటర్ల పొడవు గల ఇంఫాల్-మోరే రహదారి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ చేపట్టింది. ఈ రహదారి భారత మయన్మార్‌ల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచి, సరిహద్దు వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
  3. తవాంగ్ రోడ్ ప్రాజెక్టు: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ రోడ్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ బాధ్యత వహిస్తుంది. ఈ రహదారి భారత-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న తవాంగ్ జిల్లాకు సకల వాతావరణ అనుసంధానాన్ని అందిస్తుంది.
  4. కైలాస మానస సరోవర్ రోడ్ ప్రాజెక్టు: ఉత్తరాఖండ్‌లోని కైలాస మానసరోవర్ రోడ్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ బాధ్యత వహిస్తుంది. ఈ రహదారి భారతదేశం, చైనాల మధ్య రోడ్డు సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. కైలాస మానసరోవర యాత్రకు చిన్న మార్గాన్ని ఏర్పరుస్తుంది.
  5. SASEC రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టు: ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ దక్షిణాసియా సబ్‌రీజినల్ ఎకనామిక్ కోఆపరేషన్ (SASEC) రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టును అమలు చేస్తోంది, ఇందులో దాదాపు 500 కి,మీ. నిడివి గల రోడ్డు ఉన్నతీకరణ ఉంటుంది. ఈశాన్య ప్రాంతంలో రహదారుల కనెక్టివిటీని మెరుగుపరచడం, ఈ ప్రాంతంలో వ్యాపార వాణిజ్యాలను ప్రోత్సహించడం దీని లక్ష్యం.

సొరంగాలు

[మార్చు]

ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ ప్రారంభమైనప్పటి నుండి సవాళ్లతో కూడిన పరిస్థితులలో సొరంగాలను నిర్మిస్తోంది. కొన్ని పెద్ద సొరంగం ప్రాజెక్టులు క్రింది విధంగా ఉన్నాయి:

  • జోజి-లా సొరంగం : కనెక్టివిటీని మెరుగుపరచడానికి సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, చైనా సరిహద్దు సమీపంలో భారతదేశం ప్రతిష్టాత్మక జోజిలా టన్నెల్ ప్రాజెక్టును చేపడుతోంది. హిమాలయాల కఠినమైన భూభాగాల మధ్య ఉన్న ఈ సొరంగం శ్రీనగర్, లేహ్ ల మధ్య సైన్యానికి, పౌరులకూ ఏడాది పొడవునా రవాణా సౌకర్యాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.8000 కోట్ల పైచిలుకు వ్యయంతో భారతదేశంలోనే అత్యంత ఎత్తైన సొరంగ ప్రాజెక్టు ఇది. ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైన రహదారి సొరంగం (13.14 కి.మీ.) కూడా.
  • Z-Morh సొరంగం
  • షింకున్ లా సొరంగం [7]
  • సిల్క్యారా సొరంగం

ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ టన్నెల్ స్టడీస్ (CETS) ని ఏర్పాటు చేసింది.

వంతెనలు

[మార్చు]

ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ ప్రారంభమైనప్పటి నుండి కొన్ని ప్రతిష్టాత్మకమైన వంతెనలను సవాలుతో కూడిన పరిస్థితుల్లో నిర్మిస్తోంది. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు క్రింది విధంగా ఉన్నాయి:

  • ధుబ్రి-ఫుల్బరి వంతెన :

అస్సాం-మేఘాలయ సరిహద్దులో బ్రహ్మపుత్ర నదిపై ఈ వంతెనను నిర్మిస్తున్నారు. పూర్తయిన తర్వాత, ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైన వంతెనగా అవతరిస్తుంది. ప్రస్తుతం ధోలా-సాదియా వంతెన అత్యంత పొడవైనది.

మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు

[మార్చు]

హైవే ప్రాజెక్టులే కాకుండా, ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ కొన్ని మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా నిర్మిస్తోంది. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు క్రింది విధంగా ఉన్నాయి:

  • మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు:

ఒక మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును అస్సాం రాష్ట్రంలోని జోగిఘోపా వద్ద నిర్మిస్తున్నారు. ఇందులో ఒక రైల్వే సైడింగ్, జెట్టీ, గిడ్డంగులు, వ్యాపార కేంద్రాలు అన్నీ ఒకే చోట ఉండి, సరుకు రవాణాను సులభతరం చేస్తాయి.

  • ఆటోమేటెడ్ మల్టీ లెవల్ కార్ పార్కింగ్:

న్యూ ఢిల్లీలోని ట్రాన్స్‌పోర్ట్ భవన్‌లో ఒక ఆటోమేటిక్ బహుళ అంతస్థుల కారు పార్కింగును నిర్మించారు. రద్దీగా ఉండే నగరాల్లో పార్కింగ్‌ సమస్యను పరిష్కరించడం దీని లక్ష్యం.

అంతర్జాతీయ ఉనికి

[మార్చు]

ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ నేపాల్‌లో రహదారులు, వంతెనల నిర్మాణ సేవలను అందిస్తోంది. [8]

ఇతర ముందడుగులు

[మార్చు]

జాతీయ రహదారులను నిర్వహించడమే కాకుండా, సున్నితమైన పాలన కోసం ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ ఇంటర్నెట్ పోర్టల్‌లను అభివృద్ధి చేసింది. వీటిలో కిందివి ఉన్నాయి:

  • INAM ప్రో+ : ఇది మౌలిక వసతులు, మెటీరియల్స్ ప్రొవైడర్ల కోసం ఒక వెబ్ ప్లాట్‌ఫారమ్. 2015 మార్చి 10 న దీన్ని అధికారికంగా ప్రారంభించారు.
  • ఇన్ఫ్రాకాన్: సేకరణ సమయంలో మూల్యాంకన ప్రక్రియను మరింత లక్ష్యశుద్ధితో, యూజర్ ఫ్రెండ్లీగా, పారదర్శకంగా చేయడానికి, మౌలిక సదుపాయాల కన్సల్టెన్సీ సంస్థలకు, వారి ముఖ్య సిబ్బంది కోసం అభివృద్ధి చేసిన సమగ్ర జాతీయ పోర్టల్.
  • ePACE : ఇది ఒకే బటన్‌పై క్లిక్‌తో పనుల పురోగతిని పర్యవేక్షించడానికి, మెరుగుపరచడానికి ఉపయోగపడే ఆన్‌లైన్ సాధనం.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "NHIDCL Ministry of RT&H".
  2. "Appointment of Sh Anand Kumar as MD NHIDCL" (PDF). 7 October 2014.
  3. "NHIDCL Ministry of RT&H".
  4. "Field Offices-NHIDCL".
  5. "SARDP NE MoRTH".
  6. "SARDP NE MoRTH".
  7. "Centre Speeds Up Construction Work Of Shinku La Tunnel". 19 September 2020.
  8. "Field Offices-NHIDCL".